గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. బసవల వాసు (38)అనే మాజీ రౌడీషీటర్‌ను దుండగులుకత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట 12వ వీధిలోని ఓ రెస్టారెంట్ ముందు జరిగిన ఈ హత్య నగరంలో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో బసవల వాసు.. స్థానిక రెస్టారెంట్‌లో భోజనం చేసి మరో వ్యక్తితో కలిసి బయటకు వచ్చి నిల్చున్నాడు. అంతలో ఓ స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వాసును తమ వాహనంతో ఢీకొట్టారు. ఆయన అక్కడే కిందపడిపోయాడు. వెంటనే వాహనంలో నుంచి దిగిన ఐదుగురు దుండగులు కత్తులు, వేటకొడవళ్లు, కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు.
కేవలం నిమిషంలోనే సుమారు 40కిపైగా కత్తిపోట్లు పొడిచారు. అతను బతికి ఉన్నాడనే అనుమానంతో నిందితుల్లో ఒకరు మృతుడి పీకను కోశాడు. వెంటనే వచ్చిన వాహనంలోనే పరారయ్యారు దుండగులు. కొందరు ముఖాలకు టోపీలు ధరించగా, మరికొందరు గుడ్డలు కట్టుకున్నారు.కాగా, విద్యానగర్‌కు చెందిన మృతుడు వాసు కాంగ్రెస్ పార్టీ హయాంలో నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడుగా ఉండేవాడు. పాతగుంటూరులో ఇతను సోదరుడు వీరయ్యను 2004లో హత్య చేశారు. 2005లో తన సోదరుడిని చంపిన వారిని హత్య చేసిన కేసులో వాసు ముద్దాయిగా ఉన్నారు. అప్పట్లో అతనిపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు.
కొంతకాలం తర్వాత మాజీ ఎమ్మెల్యే వద్ద ఓ సెటిల్‌మెంట్ల వ్యవహారంలో ఒక వ్యక్తి మృతి చెందిన కేసులో వాసుకు జైలుశిక్ష విధించగా ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది. కాగా, ఈ హత్యకు సంబంధించి అర్బన్ ఎస్పీ విజయరావు స్వయంగా విచారణ చేపట్టారు.ఘటనాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం అదుపులోకి తీసుకున్న అనుమానితులను ఆయన విచారిస్తున్నారు. హత్య జరిగిన రెస్టారెంట్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సేకరించారు. మరో వ్యక్తితో కలిసి రెస్టారెంట్‌కు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో ఉంది. ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.